Friday, October 18, 2024

TG: వర్షాలపై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి… మంత్రి కొండా సురేఖ

వరంగల్, జులై 22 : జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుండి హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు, సిటీ పోలీస్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్లు డీసీపీలు, సంబంధిత శాఖల జిల్లా, మండల అధికారులు, తహసీల్దార్లతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహణకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని చెరువులు నిండి ఉన్నందున, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా, మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తహసీల్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జలమయమయ్యే ప్రాంతాల్లో నిర్వాసితులైన ప్రజలకు భోజనం, వృద్ధులకు పండ్లు, పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలన్నారు.

చెరువులు నిండి వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉద్ధృతితో రోడ్లు తెగిపోయి ఉదృతంగా ప్రవహించిన ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని బ్యారికలు ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరాలో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటలలోని నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ క్లోరినేషన్ చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుద్ధ్య, ఆరోగ్య సమస్యల పరంగా మరింత క్లిష్టమైనవని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలన్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితులను తన దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ల దృష్టికి కానీ తీసుకురావాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.

అత్యవసర సహాయం కోసం ప్రజలు వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ 1800 425 3434, 9154225936, 1800 425 1115 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800 425 1980, 9701999676 విద్యుత్ కు సంబంధించిన సమస్యలను పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ జూమ్ మీటింగ్ లో వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పీ ప్రావీణ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీలు, డీఎంహెచ్ ఓ, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా అగ్నిమాపక నివారణ అధికారి, జిల్లా, మండల అధికారులు తహసీల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement