ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీఆర్ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈ లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని, అందుకు గల కారణాలను తెలుసుకుని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు గుత్తేదారులతో యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించి నెల రోజుల లోపు పూర్తి చేయించాలని కోరారు.
కొన్ని గ్రామాల్లో మహిళా సమైఖ్య భవనాలకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా, పనులు పూర్తి చేయకపోవడం పట్ల అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా, కొన్ని చోట్ల ఇంకా జీపీ బిల్డింగ్స్ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని, ఆ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు.