పెద్దపల్లి – కాంగ్రెస్కు ఓటేస్తే రైతులకు మూడు గంటలకు కరెంటు మాత్రమే ఇస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం సుద్దాల క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల లో ఏర్పాటుచేసిన రైతు సమావేశంలో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు లేక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారని, రాత్రిపూట కరెంటుతో రైతులు మృత్యువాత పడ్డారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా నాణ్యమైన విద్యుత్తును రైతాంగానికి సరఫరా చేస్తున్నారన్నారు. టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ అసలు నైజం బయటపడిందన్నారు.
రైతు సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మాయ మాటలు నమ్మి మోసపోతే రైతుబంధు కూడా రద్దు చేస్తారన్నారు. నాలుగువేల రూపాయల పింఛన్ ఇస్తామని ఓట్ల కోసం కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం వెయ్యి రూపాయల లోపే పింఛన్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4 వేల పింఛన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాయ మాటలు నమ్మితే మోసపోతామని తెలంగాణ ప్రజలకు తెలుసని, రాష్ట్రంలో మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని, ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితి లేదన్నారు.