ప్రభుత్వం డిసెంబర్ 9 వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాల నిర్వహిస్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిబ్బందితో కలిసి అవినీతి నిర్ములన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవినీతితో సమాజానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవినీతి నిర్మించాలనే సంకల్పంతో సమాజంలో చైతన్యం కలిగించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టాలు వివరించడంతో పాటు ఏసిబీ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించడం, వారి సందేహాలు తీర్చడం లక్ష్యంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు తమ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.