హైదరాబాద్, ఆంధ్రప్రభ : పది రోజులుగా కుండపోత వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరణుడు శాంతించాడు. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెదర్ బులిటెన్‌ను విడుదల చేసింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వివరించింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వెల్లడించింది. మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురుస్తాయని తెలిపారు. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరును మించి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీంఆసీఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరునుంచి మించి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలిపి ప్రాంతీయ వర్షపాతం 27.8 మి.మీల కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు జిల్లాల వారీగా కురిసిన వర్షాపాతం వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదలచేసింది.
జిల్లా వర్షపాతం మి.మీ.లలో
ఆదిలాబాద్ 55.9
భద్రాద్రి కొత్తగూడెం 7.9
హన్మకొండ 19.3
హైదరాబాద్ 16.2
జయశంకర్ భూపాలపల్లి 35.6
జగిత్యాల 84.7
జనగామ 13
జోగులాంబ గద్వాల 1.8
కామారెడ్డి 62.3
కరీంనగర్ 20.9
ఖమ్మం 1.4
కుమరంభీం ఆసీఫాబాద్ 28.7
మేడ్చల్ మల్కాజిగిరి 13.7
మహబూబాబాద్ 12.1
మహబూబ్‌నగర్ 7.2
మంచిర్యాల 15.8
మెదక్ 35.4
ములుగు 20.5
నాగర్‌కర్నూలు 0.5
నల్గొండ 0
నారాయణపేట 9.9
నిర్మల్ 140.7
నిజామాబాద్ 121.2
పెద్దపల్లి 18
రాజన్నసిరిసిల్ల 86.4
రంగారెడ్డి 10.6
సిద్దిపేట 19.7
సూర్యాపేట 1.3
వికారాబాద్ 22.9
వనపర్తి 4
వరంగల్ 29
యాదాద్రి భువనగిరి 11.6