- ఫార్మా భూముల సేకరణ ఆపేది లేదు
- అడ్డుపడితే ఊరుకునేది లేదు
- అరెస్ట్ కాకుండా ఉండేందుకే కేటీఆర్ ఢిల్లీలో ప్రదక్షిణలు
- మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడి
హైదరాబాద్ – దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడమని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్ పై జరిగిన దాడి విషయంలో కేసీఆర్ స్పందించాలన్నారు.. ఈ విషయంలో కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. హైదరాబాద్ లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. దీని వెనక కేటీఆర్, మాజీ ఎంఎల్ఏ లు ఇంకా ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టమన్నారు.
జైల్ కు వెళ్తే సానుభూతి కోసం చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్, కేటీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టమన్నారు. చట్ట ప్రకారం అందరూ శిక్ష అనుభవిస్తారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణం కోసం దళితులు, బీసీలపై కేసులు పెట్టించిందన్నారు. జైల్ కు వెళ్ళకుండా రక్షణ కోసమే కేటీఆర్ డిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. ఫార్మా సిటీ భూముల సేకరణను ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు.. దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనుకాడమన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదన్నారు. బీజేపీ, కేంద్ర మంత్రుల తీరు చూస్తుంటే.. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ఉందన్నారు.