Tuesday, November 26, 2024

ఆదర్శప్రాయుడు, ఆపద్భాందవుడు పాయం మీనయ్య : వై.సతీష్ రెడ్డి

ములుగు జిల్లాలో ఇటీవలి వరదల్లో 40మంది విద్యార్థులను కాపాడిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడిని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి సన్మానించారు. పాయం మీనయ్య అనే ఉపాధ్యాయుడు ములుగు జిల్లా కొండాయి గ్రామంలోని గురుకుల పాఠశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆయన స్కూళ్లోనే ఉన్నారు. వర్షం ఎక్కువగా ఉండటం వరద వచ్చే పరిస్థితి ఉండటంతో ఆయన వెంటనే స్పందించారు. స్కూళ్లోనే ఉంటే ప్రమాదమని భావించి, 40మంది విద్యార్థులను తన ఇంటకి తీసుకెళ్లి అక్కడే వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించారు. భారీ వరద నుంచి వారిని కాపాడారు.

40 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయుడు, ఆపద్భాందవుడు పాయం మీనయ్యను కలిసేందుకు స్వయంగా కొండాయి వెళ్లారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. అదే స్కూళ్లో ఉపాధ్యాయుడిని అభినందించి సన్మానించారు. ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను కాపాడటం కూడా అని తన పని ద్వారా చాటి చెప్పారని కొనియాడారు. 40 కుటుంబాల్లో ఆనందాన్ని నింపి, ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడన్నారు. ఆయన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుడు మీనయ్యను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సన్మానించాలని నిర్ణయించడంతో ఆయనకు సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, స్థానిక సర్పంచ్ వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు రామయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement