Friday, November 22, 2024

రోగి సహాయకులకు మూడు పూటలా కడుపు నిండుగా రూ.5 కే భోజనం..

రోగుల వెంట ప్రభుత్వ దవాఖానలకు వచ్చే సహాయకుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందనున్నది. ఈ పథకం మూడు పూటలా అమలుకానున్నది. ఈ మేరకు ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌తో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ప్రభుత్వం తరపున టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, హరే కృష్ణ సంస్థ తరఫున సీఈవో శ్రీమాన్‌ కాంతేయదాస ప్రభు ఎంవోయూపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలోని 18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రోగులు, వారి సహాయకులు వస్తున్నారని చెప్పారు. దీర్ఘకాలిక రోగులు రోజుల తరబడి చికిత్స పొందుతున్నారని, వారికి ప్రభుత్వమే పోషకాహారం అందిస్తున్నదని తెలిపారు. వారి సహాయకులు బయట హోటళ్లలో భోజనానికి, వసతికి ఎక్కువగా ఖర్చుపెట్టాల్సి వస్తున్నదని వివరించారు. ఈ ఇబ్బందిని గమనించిన సీఎం కేసీఆర్‌, వారు విశ్రాంతి తీసుకొనేందుకు షెల్టర్లు నిర్మించాలని, మూడు పూటలా నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారని చెప్పారు. అన్నపూర్ణ కేంద్రాల్లో మాదిరిగా రోగుల సహాయకులకు రూ.5 కే మూడు పూటలా భోజనం అందించనున్నట్టు తెలిపారు. రోగి సహాయకులు ప్లేట్‌ భోజనానికి రూ.5 చెల్లిస్తే, హరే కృష్ణ సంస్థకు ప్రభుత్వం రూ. 21.25 చెల్లిస్తుందని వివరించారు. నిత్యం దాదాపు 20 వేల మందికి మూడు పూటలా భోజన సదుపాయం కలుగుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.38.66 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ పథకం వల్ల ఒక్కొక్క సహాయకుడికి రోజుకు కనీసం రూ.150 వరకు ఆదా అవుతుందని భావిస్తున్నారు.

పది రోజుల్లో సౌకర్యాల కల్పన..

దవాఖానల్లో భోజనం చేసేందుకు నీటి సదుపాయం, షెల్టర్స్‌, ఫ్యాన్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పదిరోజుల్లో ఏర్పాటుచేస్తుందని హరీశ్‌రావు వివరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను భాగస్వాములుగా చేసి ఈ కార్యక్రమాన్ని 18 దవాఖానల్లో ఒకేసారి ప్రారంభిస్తామని వివరించారు. హరే కృష్ణ సంస్థతో పదేండ్లుగా తనకు అనుబంధం ఉన్నదని, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పాఠశాల్లో విద్యార్థులకు, జిల్లా గ్రంథాలయాల్లో, ‘సద్దిమూట’ పేరుతో రైతులకు భోజన వసతి కల్పించామని గుర్తుచేసుకొన్నారు. ఈ సందర్భంగా హరే కృష్ణ సంస్థ చైర్మన్‌ సత్య గౌరచంద్రకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావు, ట్రస్ట్‌ ప్రతినిధి ధనుంజయ దాసప్రభు తదితరులు పాల్గొన్నారు.

భోజనం మెనూ..

- Advertisement -

ఉదయం: పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్‌ బిర్యానీ, సాంబార్‌ రైస్‌, పచ్చడి
మధ్యాహ్నం, రాత్రి: అన్నం, సాంబార్‌ లేదా పప్పు, పచ్చడి, కూర.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement