యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు పదో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మహపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం తరువాత రెండవసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు. మరోవైపు రాత్రికి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు రాత్రి రథోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. కొండపైన ఆలయ తిరు మాడ వీధుల్లో శాస్త్రోత్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు. తండోపతండాలుగా తరలివచ్చారు. రాత్రి 8 గంటల 45నిమిషాలకు మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. రథంలో యాదాద్రీశుడి జంట ఊరేగుతున్న సమయంలో భక్తుల జయజయ ధ్వానాలతో ఆలయ వీధులు మార్మోగాయి. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో రథోత్సవ ఊరేగింపు మహాఘట్టం ప్రశాంతంగా ముగిసింది.