శంకరపల్లి: శంకర్ పల్లి మార్కెట్ రోడ్డులో అడ్డదిడ్డమైన పార్కింగ్ కారణంగా అవస్థలు పడుతున్న రైతులు, మార్కెట్ కు వచ్చే వినియోగదారులు. గత మార్కెట్ కమిటీ వారు రైతులు తాము పండించిన పంటలను అమ్ముకొనడానికి సరైన మార్కెట్ అవసరమని మంచి ఉద్దేశంతో అప్పు తెచ్చి మరీ రోడ్డు వేయించారు. రైతుల కోసం వేసిన రోడ్డు రైతులకు ఎందుకు పనికి రాకుండా కార్ల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు అయింది. ఈ రోడ్డులో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు అటువైపు తొంగి చూసే సాహసం చెయ్యరు. అసలు కమిషనర్ సమస్యను పరిష్కరించాలంటే చిటికలో పని. ఒకవైపు ట్రాఫిక్ సమస్య, మరొకవైపు మురుగునీరు దాటుకుంటూ రైతులు మార్కెట్లోకి వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.
రైతుల కోసం గొప్పగా మాట్లాడే ఏ అధికారి ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయడం లేదు. మరి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారా అంటే అలాంటి పరిస్థితులు ఉండవు. ఇలాంటి పరిస్థితులలో కోటి రూపాయల పై చిలుకు మొత్తాన్ని ఖర్చు పెట్టి వేసిన మార్కెట్ కమిటీ రోడ్డు రైతులకు ఉపయోగపడకుండా పోతూ ఉండడం ఒకింత ఇబ్బంది కలిగే విషయమే. రైతు ఆరుగాలం కష్టపడి తాను పండించిన పంటలను అమ్ము కొనటానికి మార్కెట్ కు తీసుకువచ్చే క్రమంలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది. ప్రభుత్వ పెద్దలు రోడ్డు వేయించగలరు కానీ దగ్గర ఉండి చూడలేరు కదా. అది చూసుకోవాల్సింది స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రమే.. కానీ ఆ అధికారులే పట్టనట్లు ఉంటే రైతుల విషయంలో న్యాయం ఎలా జరుగుతుందో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతున్న పరిస్థితి మున్సిపాలిటీ కేంద్రంలో నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..