హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌కు విదేశీ గడ్డ మీద ఒక ఆత్మీయ అతిథి తారసపడ్డారు. 30 ఏళ్లకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తూ తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్‌ను ఆదివారం కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌కు కేటీఆర్ హ్యాట్సాఫ్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాలకు వేల మైళ్ల దూరంలో ఉండి కూడా తెలుగుపై పరిశోధిస్తున్నందుకు ప్రొఫెసర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలుగు భాష అభ్యున్నతికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రొఫెసర్‌కు వివరించారు. గతంలో తెలంగాణ రాజధాని నగరం హైదరా బాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల గురించి మంత్రి తెలియజేశారు.
రాష్ట్రంలో ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా విద్యార్థులకు బోధిస్తున్న విషయాన్ని కూడా మంత్రి ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన అంశంపైనా ఇరువురు చర్చించారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్‌లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నెగర్స్ గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాషపై చేస్తున్న పరిశోధన గురించి ఈ భేటీలో మంత్రి కేటీఆర్‌కు డానియేల్ వివరించారు.
ఫ్రెంచ్ జాతీయులై ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం అని కేటీఆర్ ప్రొఫెసర్ నెగర్స్‌ను ఈ సందర్భంగా కొనియాడారు.