ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ జులై 18: . తమ సమస్యలను పరిష్కరించి, సమ్మెను విరమింపజేసేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా గ్రామపంచాయతీ కార్మికులు జేఏసీ మంత్రి మల్లారెడ్డిని కోరింది.. మేడ్చల్ జిల్లా గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి జేఏసీ నాయకులు జయచంద్ర (ఏఐటియుసి), శ్రీనివాస్ (సిఐటియు), శివ బాబు (ఐఎఫ్టియు)లు బోయిన్పల్లి లోని మంత్రి నివాసంలో కలుసుకున్నారు. అనంతరం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలలో దాదాపు 50 వేల కార్మికులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి వివరించారు. . గ్రామపంచాయతీలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారో బార్లు, బిల్ కలెక్టర్లు గత 20 నుండి 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వీరు నర్సరీలు, వైకుంఠధామాలు, పార్కులు, ఆఫీసు పరిసరాలల్లో తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా, ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఇలాంటి కార్మికులకు రాష్ట్రంలో కనీస వేతనాలు ఇవ్వటం లేదని జేఏసీ నాయకులు మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి, కార్మిక సమస్యలను పరిష్కారం చేసి, సమ్మెను విరమింప చేయాలని వారు కోరారు. కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి ఏ హక్కుల్ని కార్మికులు నోచుకోకపోవడం అన్యాయమని జెఎసి నాయకులన్నారు.
మంత్రి మల్లారెడ్డి సానుకూల స్పందన:
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, కార్మికుల సమస్యలపై ఈ రోజే సెక్రటేరియట్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని, మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వివరిస్తాననీ హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో సమస్యల పరిష్కారం అయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు.