కుల్కచర్ల (ప్రభ న్యూస్) : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించే సమీక్షలకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదని అడిగిన పాపానికి ఓ ప్రజా ప్రతినిధిపై పంచాయతీ కార్యదర్శి నోటిదురుసు ప్రదర్శించారు. ఇది వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఇవ్వాల జరిగింది. ఆ కార్యదర్శి ప్రజాప్రతినిధిని బూతులు తిడుతూ ఇష్టమున్నట్టు మాట్లాడారు. కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామంలో ఇది జరిగింది. అక్కడ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మురళికృష్ణ స్థానిక ఎంపీటీసీకి బుధవారం నిర్వహించిన వీసీకి హాజరు కావాలని సమాచారం ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొనాల్సి ఉంది.
ఈ అంశంపై సమాచారం ఇవ్వలేదని ఘనపూర్ ఎంపీటీసీ తనయుడు పంచాయతీ కార్యదర్శిని అడిగారు. దీంతో పంచాయతీ కార్యదర్శి మురళి కృష్ణ నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టాడు. లం.. కొడకా, తరిమి తరిమి తంతా.. అంటూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. దీంతో ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కాగా, పోలీసుల ప్రమేయంతో పరిస్థితి సద్దుమణిగింది. పంచాయతీ కార్యదర్శి బూతుపురాణం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆడియో విన్న స్థానిక ప్రజలు ఇలాంటి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.