బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతల విమర్శలకు పదునుపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈటలపై మండిపడ్డారు. ఈటల కమ్యూనిజం, బహుజన వాదం ఎక్కడ పోయింది? అని ప్రశ్నించారు. తనది బహుజన వాదం అని చెప్పుకునే ఈటల రాజేందర్.. తన వాదాన్ని బీజేపీ నాయకుల కాళ్ల ముందు తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. ఈటల మాట్లాడుతున్న మాటలకు ప్రజలంతా ఛీ కొడుతున్నారని అన్నారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి చట్ట విరుద్ధమైన పనులను ఈటల ఎలా చేశారని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను తీసుకున్న ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడుందని పల్లా ప్రశ్నించారు.
గత 20 ఏళ్ల కాలంలో తమ అధినేత కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని… వారిలో ఈటల ఒకరని పేర్కొన్నారు. ఈటలను గౌరవించినంతగా మరే నేతను కేసీఆర్ గౌరవించలేదని చెప్పారు. టీఆర్ఎస్ లో ఎక్కువ పదవులను ఈటల అనుభవించారని… పదవి లేకుండా ఆయన ఎప్పుడూ లేరని గుర్తు చేశారు. పార్టీ అధినేతపై నమ్మకం లేదని ఈటల చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ధ్వజమెత్తారు. ఈటల చేసిన పనికి ఆయనపై పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈటల ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నారని వ్యాఖ్యానించారు.