ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలుంటాయన్న విషయం తెలియని కూలీలు ఇవ్వాల ఉదయమే పనులకు వెళ్లారు. వరి నాట్లు వేసి తిరిగి వస్తుండగా పాలేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఎట్లా రావాలో తెలియక అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్యాపేట, మహబుబాబాద్ జిల్లాల పోలీసులు, అధికారులు వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిపెడ, (ప్రభ న్యూస్): వరి నాటు వేసేందుకు వెళ్లిన 23మంది పాలేరు ఏరు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. రెండు జిల్లాల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వారిని రెస్క్యూ చేసేందుకు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెందిన 23 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మురుకొండ శ్రీను పొలాన్ని పంతం నాగయ్య అనే రైతు కౌలుకు తీసుకున్నాడు. వానాకాలం పంట కోసం నాట్లు వేసేందుకు తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెందిన కూలీలు 23మంది ఉదయం ఆటోలో ముకుందాపురం గ్రామశివారు లోని పాలేరు ఏటి వద్దకు వెళ్లారు.
అనంతరం ఏరు దాటి నాటు వేసేందుకు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో పాలేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. సాయంత్రం ఇంటికి బయల్దేరిన కూలీలు ఏరు దాటే పరిస్థితి లేకపోవటంతో అక్కడే చిక్కుకున్నారు. అటు వైపు వెళ్లేందుకు మరే మార్గం లేకపోవటంతో అక్కడే ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు, సూర్యపేట జిల్లా మద్దిరాల పోలీసులు, అధికార యంత్రాంగం వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి అయిన పాలేరు ఉధృతికి వారిని రెస్క్యూ చేయటం ఇబ్బందిగా మారింది. కూలికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరక పోవటంతో రెండు తండాల్లో ఆందోళన నెలకొంది.