Tuesday, October 1, 2024

Palamuru – క‌మ్ముకొస్తున్న క‌రవు మేఘం – ఊరిస్తున్న కారు మ‌బ్బులు

– ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ప్రభన్యూస్ – ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,77,917 హెక్టార్ల పంట‌లను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖ‌రీఫ్ ప్రారంభంలో కురిసిన వ‌ర్షాల‌కు విత్తనాల‌కు మొలకలు వ‌చ్చాయి. ఈ ఏడాది పంట‌లు బాగుంటాయ‌ని రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు. ఎంతో ఆశ‌తో వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభించింది. తీరా పైరు ఎదిగే క్రమంలో వరుణుడు ముఖం చాటేశాడు. వరుణుడి జాడ కనిపించడం లేదు. రుతుపవనాలు ప్ర‌వేశించినా వ‌ర్షాలు ప‌డ లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా చుక్క చినుకు కూడా లేదు. వ‌రుణుడు క‌రుణించాల‌ని రైతులు చేయని పూజలు లేవు, మొక్కని దేవుళ్లు లేరు. వరుణుడి కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పొలాలు ఎండిపోవ‌డంతో రైతాంగం ఆందోళ‌న చెందుతోంది.

- Advertisement -

కూలీల అవ‌స్థ‌లు

ప్ర‌స్తుతం వ‌ర్షాలు లేక‌పోవడంతో వ్య‌వ‌సాయ ప‌నులు కొన‌సాగ‌డం లేదు. దీంతో కూలీల‌కు ప‌నులు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. మ‌రో వారం రోజుల్లో వ‌ర్షాలు లేక‌పోతే వ‌ల‌స‌బాట ప‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంద‌ని కూలీలు ఆందోళ‌న చెందుతున్నారు. ఒక వైపు ఆదాయం లేక‌పోవ‌డంతో మ‌రో వైపు అన్నిర‌కాల‌ కాయ‌గూర‌లు, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో అర్ధ‌క‌లి జీవ‌నం సాగించాల్సి వ‌స్తోంద‌ని వారు ఆవేద‌న చెందుతున్నారు.

మరోవారంలో వర్షాలు కురవకపోతే…

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మ‌రో వారం రోజుల్లో వ‌ర్షాలు కుర‌వ‌క‌పోతే పంట‌ల‌పై ఆశ‌లు విడిచి పెట్టుకోవాల‌ని రైతులు అంటున్నారు. ఒక్క పత్తి పంట మీద కాదు కాయ‌గూర‌ల సాగుపై కూడా వ‌ర్షాభావ ప‌రిస్థితులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని రైతులు చెబుతున్నారు. వ‌ర్షాలు ప‌డ‌క‌పోతే పంట భూములు బీడు భూములుగా మారుతాయ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

పొడి విరామం

వర్షాధార భూములున్న ప్రాంతాల్లో సాగుచేసే పంటలకు వర్షాలే కీలకం. ఒక వర్షం పడిన తరవాత మరో వర్షం ఎన్నిరోజుల్లో కురిసిందనే లెక్కల ఆధారంగా పంటల దిగుబడులను అంచనా వేస్తారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది కరవును గుర్తించేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది. వీటి ప్రకారం ఒక ప్రాంతంలో ఒక సారి వర్షం కురిసిన రోజు నుంచి 28 రోజుల వరకూ సరైన వర్షం పడకపోతే ‘పొడి విరామం (డ్రైస్పెల్‌) ఏర్పడి పంటలు ఎండిపోయి కరువు నెలకొన్నట్లు గుర్తిస్తారు. ఈ నిబంధనల ప్రకారం జూన్‌ 20 నుంచి ఈ నెల 4 వరకూ 15 రోజుల పాటు పొడి విరామం ఏర్పడింది.

ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టాలి

పాల‌మూరు జిల్లాలో రైతుల‌ను, కూలీల‌ను ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇప్ప‌టికే క‌రువు ప‌రిస్థితుల‌తో రైతులు దిగులు చెందుతున్నారు. ఒక వేళ వాతావ‌ర‌ణం అనుకూలిస్తే మ‌ళ్లీ విత్త‌నాలు పోయ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ మేర‌కు విత్త‌నాలు సిద్ధం చేయ‌డం, కూలీల‌కు ప్ర‌త్యామ్న‌య మార్గం ద్వారా ఉపాధి క‌ల్పించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement