హైదరాబాద్, ఆంధ్రప్రభ : పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావును తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం కోరింది. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి ఎర్రబెల్లిని సర్పంచ్ల సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా కేంద్రం నిధులను ఆపివేయడం వలన స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు.
ఉపాధి హామీలో మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ ఆగిపోయాయని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 15వ ఆర్ధిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం స్థానిక సంస్థలకు నిధులు అందజేస్తుందన్నారు. కేంద్రం నిధుల విడుదలను నిలిపివేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను ఇస్తున్నదని వారు వెల్లడించారు. ఈ ఏడాది మే నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని వారు వివరించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, బూడిద రాంరెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఉదయశ్రీ తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.