Friday, November 22, 2024

TS: పంచాయతీల్లో పైసల్లేవ్.. పడకేసిన పాలన..

నిధులు మంజూరు కాక ఎక్కడి పనులు అక్కడే
రాష్ట్ర నిధులు రాక 25నెలలుగా, కేంద్ర నిధులు లేక ఐదు నెలలు
సిబ్బందికి జీతమెల్లక ఇబ్బంది
వాజేడు, జూన్ 10 ప్రభ న్యూస్: గ్రామపంచాయతీల్లో పైసలు లేక పాలన పడకేసింది. నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్ర నిధులు 25నెలలుగా ఆగిపోవడం, కేంద్రం నిధులు ఐదు నెలల నుండి మంజూరు కాకపోవడంతో సిబ్బందికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి పంచాయతీలో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించారు. ములుగు జిల్లాలో 174 పంచాయతీలు ఉన్నాయి. వాజేడు మండలంలో 17 పంచాయతీలు ఉన్నాయి.

పంచాయతీలో గత ఐదు నెలలుగా నిధులు లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే తిష్ట వేశాయి. కనీస పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి కూడా పైసలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ సిబ్బందికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి గ్రామపంచాయతీల్లో ఏర్పడడంతో పంచాయతీ పాలన పడకేసి దర్శనమిస్తుంది. పరిపాలన సౌలభ్యం కోసం గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించినా నిధుల్లేక పంచాయతీల్లో పాలన మూలన పడుతుంది.

సిబ్బందికి జీతమెల్లక ఇబ్బంది :
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి గత ఐదు నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలకు కనీస నిధులు కూడా మంజూరు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీలో పనిచేయడానికి వెనకాడుతున్నారు. పంచాయతీలో చెత్త ఎత్తడానికి ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందంటే పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పంచాయతీ పాలన గాడిలో పెట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement