ఆలేరు, (ప్రభ న్యూస్) : కంటికి ఇంపైన రంగులతో నిత్యం సహచర్యం… అద్భుత కళాఖండాలను ఆవిష్కరించే మహోన్నత నైపుణ్యం… జీవితమేమో ఆకలి చీకట్లు, పేదరికం కుంపట్లు అన్నట్టుగా దయనీయత మోహరించిన దుర్భరం… ఇదీ కుంచెను నమ్ముకుని కడుపు నింపుకునే పెయింటర్ల దయనీయ దుస్థితి. ఫ్లెక్సీలు రంగ ప్రవేశం చేయడంతో గోడలపై చిత్రాలు వేయించి పెయింటింగ్ చేయించడం, బోర్డులు, బ్యానర్లు రాయించడం వంటి పనులకు పెయింటర్ల అవసరం ఎంతమాత్రం లేకుండా పోయింది. రెడీమేడ్ అన్నట్టుగా అప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో ఫ్లెక్సీలు తయారు చేయించుకుని కార్యక్రమాలను నిర్వహించడానికి అటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అలవాటు పడిపోయారు.
ప్రింటింగ్ టెక్నాలజీ అద్భుతాలలో ఒకటిగా చెప్పుకునే ఫ్లెక్సీ మేకింగ్, ప్రింటింగ్ మాట ఎలా ఉన్నా అది ఎన్నో యేండ్ల తరబడి పెయింటింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు అర్థాకలిని అంటగడుతున్నదని పెయింటర్లు వాపోతున్నారు. తమ వృత్తిని కాపాడడం ద్వారా తమ కుటుంబాల ఆకలి మంటలను చల్లార్చాలని, అప్పులు, అనారోగ్యాల నుండి కాపాడాలని ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తున్న పెయింటర్లు తమ సమస్యలను వివరిస్తూ వారికి వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. తమ కుటుంబాలకు విద్య ,వైద్య, పెన్షన్, ప్రయాణ రాయితీ, డబుల్ బెడ్‌రూం ఇంటి సౌకర్యాలను కల్పించాలని, జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలను నిషేధించి పెయింటర్లు రాసిన బ్యానర్లు, బోర్డులు ఉపయోగించేలా ఆదేశాలివ్వాలన్న విజ్ఞప్తులు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily