Saturday, November 23, 2024

కాగితాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. ఫీల్డ్ లో కనిపించట్లే..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కొనుగోలు కోసం కాగితాల్లో చూపిస్తున్న కేంద్రాలకు, ప్రత్యక్షంగా సెంటర్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు పొంతన లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయంటూ పౌరసరఫరాల శాఖ విమర్శలు ఎదుర్కో వాల్సివస్తోంది. ఈ ఏడాది వానాకాలంలో ధాన్యం కొనుగోలుకు ఐకేపీ, పీఏసీయస్‌ సంఘాలు ముందుకు రాకపోవడంతోనే ఆలస్యం జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కారణమేంటన్నది పరిశీలిస్తే గతేడాది కొనుగోలు అయిన ధాన్యం మిల్లుకు వెళ్లేంతవరకూ రైతుదే బాధ్యత ఉండగా, ఈసారి ప్రభుత్వం నిబంధనలను మార్చడంతో కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి, ట్రాన్స్‌పోర్ట్‌ అయిన తరువాత రైతుకు బాధ్యత లేకపోవడమేనని తెలిసింది.

గతంలో మిల్లు వద్దకు రైతు వెళ్లడంతో కేంద్రాల వద్ద విధించిన కోత కాకుండా మిల్లు దగ్గర కూడా కొంత మేరకు తాలు, తేమ పేరుతో కోత కోసే వారు, ఈ సారి ధాన్యం వద్ద రైతులు లేకపోవడం, కొనుగోలు సెంటర్లలోనే తేమ, తాలు పేరిట కోత విధించి ధాన్యం కాంటా వేస్తుండడంతో అదనంగా కోత విధించే అవకాశం లేకపోవడంతో మిల్లర్లు, సంఘాలు కొనుగోలుకు అనాసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి 2021 ఆగస్టు 18న ‘ధాన్యం కొనుగోళ్లలో పందికొక్కులు’ పేరిట ఆంధ్రప్రభ కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సారి ఇదే కారణంతో కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో జాప్యం జరుగుతుందని రైతు సంఘం నేత ఆంధ్రప్రభతో అన్నారు.

ధాన్యం కొనుగోలు జాప్యానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా ప్రధానంగా మిల్లర్లకు కేటాయించాల్సిన అలాట్‌మెంట్‌ ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాకపోవడ మనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అధికారులు చెప్పిన మేరకే మిల్లర్లు తీసుకుంటుండడం గమనార్హం. దీంతో మిల్లుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇప్ప టికైనా అధికారులు మిల్లులకు కేటాయించాల్సిన అలాట్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలు కోసం ఈ ఏడాది 6,821సెంటర్లు ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ ఇవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖమ్మంలో మొదటగా అధికారులు 246కేంద్రాలను ప్రతిపాదించగా ఇప్పటివరకు 126 ప్రారంభిం చి 1.13లక్షల మెట్రిక్‌ టన్నులు ఆదివారం నాటికి కొనుగోలు చేసినట్టు అధికారికంగా చెబుతున్నారు. రైతు సంఘం నేత మాత్రం 179 ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు కేవలం 9 మాత్రమే ప్రారంభించారని, ప్రారంభించిన సెంటర్లలోనూ అంత మాత్రంగానే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌లోనూ 352 సెంటర్లు అని చెప్పగా ఇప్పటివరకు 271 సెంటర్లలో కొనుగోలు చేస్తున్నారని ఆ జిల్లా రైతు సంఘం నేత చెప్పారు. దీంతోపాటు జమ్మికుంట, హుజూరాబాద్‌ ప్రాంతంలో ధాన్యం దిగుమతికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

కొనుగోళ్లు వేగంగా జరగకపోవడంతో అకాల వానలకు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కోతలు పూర్తయి ధాన్యం కేంద్రాలకు చేరింది. కొనుగోలు చేయకపోవడంతో తడిసి, మొలకొస్తున్నాయి. తడవకుండా ఉండేందుకు పట్టాలు కూడా ఇవ్వకపోవడం, ఆరబోత యంత్రాలను అందించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను దృష్టిలోకి తీసుకుని మిల్లర్లు, సంఘాలతో చర్చించి కొనుగోలు త్వరి తగతిన పూర్తయ్యేలా చూడాలి.

- Advertisement -

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement