Monday, November 25, 2024

Paddy – వ‌డ్ల‌కు డిమాండ్‌ – కల్లాల వద్దే కాంటా

ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న వ్యాపారులు
కనీస మద్దతు ధర కంటే అద‌నంగానే చెల్లింపులు
మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, సరిహద్దు జిల్లాల్లో దందా
తేమ, తాలు తదితర కోతలు లేకుండానే కొనుగోళ్లు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష కండిషన్స్
డబ్బులు చేతికి రావడానికి టైమ్​ కూడా ఎక్కువే
పాత అప్పులకు జమ చేసుకుంటున్న బ్యాంకర్లు
ప్రైవేటు వారికి అమ్మితే నేరుగా చేతికే వడ్ల పైసలు
అందుకే మొగ్గు చూపుతున్న రైతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అన్ని ఏర్పాట్లు చేసినా రైతులు ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం అమ్మేందుకుమొగ్గు చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో చెల్లించే మద్ధతు ధర కంటే ప్రైవేటు కొనుగోలు కేంద్రాల్లోనే అధిక ధర పలుకుతుండడంతో వారికే ధాన్యం విక్రయించేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల జాప్యం, తేమ, తాలు తదితర నిబంధనల పేరిట కొర్రీలు, మిల్లర్ల కోతల వంటి గత అనుభవాల దృష్ట్యా ప్రైవేటు వ్యాపారులకే వ‌డ్లు అమ్మేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల పొలాల దగ్గర్లోనే కాంటా పెట్టి మరీ వ‌డ్లు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 17శాతం వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తుండడంతో అంత తేమ తగ్గేవరకు ధాన్యం ఆరబోయడం రైతులకు సవాల్‌గా మారింది.

ప్ర‌కృతి వైప‌రీత్యాల భ‌యం

మరోవైపు అకాల వర్షాలు, మండే ఎండలు, గాలి దుమారాల కారణంగా ఎప్పుడు ఎక్కడ, ఎటువైపు నుండి ప్రకృతి విరుచుకుపడి వ‌డ్ల‌న్నీ వర్షార్ఫనం అవుతాయ‌న్న‌ భయం రైతులను వెంటాడుతోంది. మండే ఎండలకు కనీసం వారం రోజులపాటు ధాన్యాన్ని ఆరబోయడం అనేది సవాల్‌గా మారింది. ఎండలకు భయపడి ధాన్యం ఆరబోసేందుకు కూలీలు కూడా రావడం లేదని, వచ్చినా ఎక్కువ కూలీ అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. అయితే.. ప్రైవేటు వ్యాపారులు మాత్రం నిర్ణీత తేమశాతం నిబంధనతోపాటు తాలు, మట్టి తదితర నిబంధనలను రైతులపై విధించడం లేదు. పొలం నుండి కోసుకొచ్చిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండడంతో రైతులు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు.

ప్రేవేటు వ్యాపారుల వ‌ద్దే మంచి రేటు

ప్రస్తుతం సాధారణ వరి ర‌కానికి ₹2183, ఏ గ్రేడ్‌ధాన్యానికి ₹2,203గా కనీస మద్ధతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం నాణ్యంగా ఉండి తేమ తక్కువగా ఉంటే ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు ₹2500 ధర చెల్లిస్తున్నారు. మహబూబ్‌నగర్‌తోపాటు సరిహద్దు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కర్నాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడంతో పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట ఎండిపోయింది. దీంతో వడ్లకు కూడా డిమాండ్‌ పెరిగింది.

- Advertisement -

రూల్స్​ గీల్స్​ ఏమీ ఉండవని..

ప్రైవేటులో అమ్ముకుంటే వెంటనే డబ్బులు చేతిలో పడుతున్నాయని, అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలను అన్నింటిని సంతృప్తి పరిచి కాంటా అయి చివరకు లోడ్‌ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారుల వైపే రైతులు వడ్లు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడ్‌ అయిన 20 రోజుల దాకా డబ్బులు అకౌంట్‌లో జమ కావడం లేదని, అకౌంట్‌లో జమ అయినా అవి బ్యాంకర్లు లోన్‌ల కిస్తీల కింద, వడ్డీ కింద జమకట్టుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వారికే విక్రయించి నగదును అందుకుంటున్నట్టు రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement