తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పీఏసీ తీర్మానించిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ పీఏసీ భేటీ సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తాము తీసుకున్న నిర్ణయాలను షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. మహిళలకు రూ.2500 అమలు, రూ.2000 ఆసరా పెన్షన్లు, రూ.4వేలకు పెంచటం.. ఇళ్ల నిర్మాణం.. రూ.500కే గ్యాస్ పంపిణీ తదితర అంశాలపై పీఏసీ చర్చించిందన్నారు. కాంగ్రెస్ ఆవిర్బావ దినోత్సవం డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు.
ఈ గ్రామ సభల్లోనే ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ గ్రామ సభల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికారులు ఉంటారని వివరించారు. ఇక రాజకీయంగా లోక్ సభ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నామని, ప్రతి నియోజక వర్గం బాధ్యతను మంత్రులు చేపడుతారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా ఎవరి దగ్గర ఎన్ని మంత్రిత్వ శాఖలుంటే అన్ని నియోజకవర్గాల బాధ్యతలు చేపడుతారని చెప్పారు. అదే విధంగా మిషన్ భగీరథలో అనేక అవకతవకలు జరిగాయని, ఆర్థిక క్రమశిక్షణ లేదని, వీటన్నిటినీ చర్చించామన్నారు.