ఘట్కేసర్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నేడు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.. అలాగే అలాగే ఈ రూట్లో కొత్తగా నిర్మించిన 6 ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా వర్చువల్ విదానంలో మోడీ ప్రయాణీకులకు అంకింతం ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పు – పడమరకు ఈజీ ప్రయాణం ..
ఈ ఎంఎంటీఎస్ లు ప్రారంభం కావడంతో నగరానికి తూర్పు నుంచి పడమటి వైపు లింగంపల్లి వరకు ప్రయాణం నగరవాసులకు సులభతరం కానుంది. ప్రత్యేకంగా ఐటీ సంస్థల్లో పని చేస్తూ ఘట్కేసర్, ఉప్పల్, మల్కాజిగిరి, మౌలాలి తదితర ప్రాంతాల్లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ రూట్ వల్ల ఎంతో ప్రయోజనం లభించనుంది. మౌలాలి-సనత్‌నగర్ మధ్య పూర్తి చేసిన రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఘట్కేసర్ నుంచి మౌలాలి-సనత్‌నగర్ మీదుగా లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
రేపటి నుంచి రెగ్యులర్ సర్వీస్ లు
ఇక 6వ తేదీ నుంచి ఈ రూట్లో ఎంఎంటీఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో ఇప్పటి వరకు లింగంపల్లి-తెల్లాపూర్, మేడ్చల్-ఉందానగర్, సికింద్రాబాద్-బొల్లారం తదితర మార్గాలు పూర్తయ్యాయి. మేడ్చల్-ఉందానగర్ మధ్య ఎంఎంటీఎస్ రెండోదశ రైళ్లను ప్రధాని మోదీ గతేడాది లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం మౌలాలి-సనత్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ, సికింద్రాబాద్-ఘట్కేసర్ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఘట్కేసర్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు ప్రయాణసదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 22 రూట్ కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో రూ.343 కోట్లతో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే ఈ రూట్లో కొత్తగా ఫిరోజ్‌గూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్ , అమ్ముగూడ, నేరేడ్మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో కొత్తగా ప్రారంభించనున్న ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫామ్‌ల ఎత్తును పెంచారు. పాదచారుల కోసం ప్రత్యేక వంతెనలు నిర్మించారు. ఈ కొత్త రూట్లో ప్రయాణికులు చర్లపల్లి నుంచి నేరుగా లింగంపల్లి వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ రూట్లో కొత్త ప్రాంతాలు ఎంఎంటీఎస్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానున్నాయి.
పెరిగవిన నెట్వర్క్ …
ఇప్పటి వరకు ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశలలో 44 స్టేషన్ల మీదుగా 90 రూట్ కిలోమీటర్లలో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా నేడు ప్రారంభమైన ఘట్కేసర్-లింగంపల్లి రూట్ వల్ల ఎంఎంటీఎస్ నెట్వర్క్ 123.52 కిలోమీటర్లకు పెరిగింది. స్టేషన్ల సంఖ్య కూడా 53కు చేరుకుంది. 48 కిలోమీటర్ల పొడవైన ఘట్కేసర్-లింగంపల్లి రూట్ తూర్పు వైపున సికింద్రాబాద్ స్టేషన్ దాటి విస్తరించడమే కాకుండా పడమటి వైపున ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హబ్‌తో కలుపుతుంది. దీంతో ఘట్కేసర్, చర్లపల్లి, మల్లాపూర్, నేరేడ్మెట్, ఈసీఐఎల్, సుచిత్ర, భూదేవినగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు పెరగనున్నాయి.
ఎంఎంటిఎస్ సమయాలు..
- ఘట్కేసర్-లింగంపల్లి రైలు (47253) ఉదయం 7.20 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. చర్లపల్లి (07.32), నేరేడ్ మెట్ (07.52), అమ్ముగూడ (8.00), భూదేవినగర్ (8.07), సుచిత్ర సెంటర్ (8.16), ఫిరోజ్‌గూడ (8.25),భరత్ నగర్ (8.34),బోరబండ (8.38),హైటెక్ సిటీ(8.43),హఫీజ్ పేట్ (8.49),చందా నగర్ (8.54)స్టేషన్ల మీదుగా బయలుదేరుతుంది.
- లింగంపల్లి-ఘట్కేసర్(47254) సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి 7.30 గంటలకు ఘట్కేసర్కు చేరుకుంటుంది. చందానగర్ (5.48), హఫీజ్ పేట్ (5.56),హైటెక్ సిటీ (6.03),బోరబండ (6.08),భరత్ నగర్ (6.12),ఫిరోజ్‌గూడ (6.21),సుచిత్ర సెంటర్ (6.30),భూదేవినగర్ (6.40),అమ్ముగూడ(6.46), నేరేడ్మెట్ (6.54), చర్లపల్లి(7.15) స్టేషన్ల మీదుగా ఘట్కేసర్కు చేరుకుంటుంది.
- ఘట్కేసర్-లింగంపల్లి మధ్య మరో ట్రైన్ ఉదయం 10.45 గంటలకు ఘట్కేసర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. ఇది చర్లపల్లి(10.59),నేరేడ్ మెట్ (11.21), అమ్ముగూడ (11.29), భూదేవినగర్ (11.36),సుచిత్ర సెంటర్ (11.45),ఫిరోజ్‌గూడ (11.54), భరత్‌నగర్ (12.03),బోరబండ (12.07),హైటెక్ సిటీ(12.12),హఫీజ్ పేట్ (12.18), చందానగర్ (12.23)స్టేషన్ల మీదుగా బయలుదేరనుంది.