Friday, November 22, 2024

ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్క్ – ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్

పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ లో కలియ తిరిగారు. మొమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌళిక వసతుల కల్పనపై ప్రొఫెసర్ రవిందర్… సంతోష్ కు వివరించారు. సమగ్ర నివేదిక( డీపీఆర్) తో వస్తే ఆక్సీజన్ పార్క్ సహా ఉస్మానియా ఆవరణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఈ సందర్భంగా వీసీకి ఎంపీ హామి ఇచ్చారు. 200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సీజన్ పార్క్ ను అభివృద్ధి చేశామని వీసీ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదవ్ తెలిపారు.

వెయ్యికి పైగా నెమళ్లు ఈ పార్క్ లో ఉన్నాయని… వాటి సంరక్షణతో పాటు బయో డైవర్సిటీకి ఓయూ కేంద్రంగా ఉందని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ కమిషనర్ గా, ఓయూ ఇంఛార్జ్ ఉపకులపతిగా ఉన్న అరవింద్ కుమార్ కృషి వల్ల ఓయూలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారని… ప్రస్తుతం ఓ అడవిని సృష్టించామని అన్నారు. వృక్ష మిత్ర ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా పార్క్ ను విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందని చెప్పారు. జీవజాతుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పాదచారులను కొంత వరకు కట్టడి చేశామని… ఉదయం, సాయంత్రం మాత్రమే కొంత మేరకు అనుమతిస్తున్నాని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహకారం వల్ల పచ్చని చెట్లతో ఉస్మానియా ప్రాంగణం ఆహ్లాదకరంగా మారిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పార్క్ ముందు ఎంపీ సంతోష్, వీసీ రవిందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement