- మెదక్ చర్చి తెలంగాణకే గర్వకారణం
- ఆకలి తీర్చిన ఆలయ స్పూర్తిగా పథకాల అమలు
- ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన, క్రైస్తవులకు ప్రాధాన్యం
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పేదల సంక్షేమ ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు, లక్ష్మీకాంతరావు, సంజీవరెడ్డిలతో కలిసి మెదక్ జిల్లాలో పర్యటించారు. క్రిస్మస్ పర్వదినాన్ని, మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి నిర్వాహకులు రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ఇంచార్జి బిషప్ రెవరెండ్ రుబెన్ మార్క్, ప్రిస్బిటర్ ఇంచార్జి శాంతయ్య గురువులు ప్రార్థన చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… క్రిస్మస్ పండుగను, ఆలయ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్ చర్చి ప్రాంగణానికి పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెదక్ చర్చికి వేలాదిగా తరలివచ్చిన ప్రతీ ఒకరికి శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్ల క్రితం కరువును నిర్మూలించేందుకు, పనికి ఆహార పథకంతో ప్రజలకు పని కల్పించి భోజనం పెట్టాలనే గొప్ప ఆలోచనతో దేవాలయం నిర్మించినట్లు తెలిపారు.
దేశంలోనే గొప్ప దేవాలయంగా ఫరిడవిలుతున్న మెదక్ చర్చి తెలంగాణకే గర్వకారణం అని కొనియాడారు. దేశ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఆలయాన్ని భవిష్యత్లో మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు చెప్పడంతో అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. చర్చిలో మంచి అనుబంధం ఉందని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు మెదక్ చర్చిని దర్శించుకొని మళ్ళీ ఏడాదికి సీఎం హోదాలో చర్చికి వస్తాను అని చెప్పడం జరిగిందన్నారు. చెప్పిన విధంగా ఇక్కడికి సీఎం హోదాలో రావడం జరిగిందని తెలిపారు. అప్పుడే రాష్ట్రంలో పేదల ప్రభుత్వం వస్తుందని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. వందేళ్ల ఉత్సవాలు, క్రిస్మస్ సందర్భంగా భక్తులతో కలిసి పండుగ జరుపుకోవాలని ఇక్కడికి రావడం జరిగిందన్నారు. పేదల ప్రభుత్వంలో రైతులకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు దళిత క్రైస్తవులు, గిరిజనులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్యాన్ని 10 లక్షలతో, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ. 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ పూర్తి చేశామని చెప్పారు.
గతంలో క్రిస్టియన్ మిషనరీలు సేవా దృక్పథంతో ఏ విధంగా విద్య, వైద్యం అందించిందో, అదే బాటలో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కరువులో ఆకలి తీర్చేందుకు చర్చి నిర్మాణం కోసం చేపట్టిన పనికి ఆహార పథకం స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాకు సంబందించి ఏ విషయం ఉన్నా మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందన్నారు. చివరగా క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలను సీఎం భక్తులకు తెలియజేశారు. అంతకుముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు, సీఎస్ఐ చర్చి ట్రేజరర్ గంట సంపత్, సెక్రెటరీ శాంసన్ సందీప్ తదితరులు ఉన్నారు.