ఇబ్రహీంపట్నం (ప్రభన్యూస్) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనులకు గాను పెద్దమొత్తంలో నిధులు సమకూర్చేలా సీఎం కేసీఆర్ తో మాట్లాడామని, ఈ మేరకు ఫిబ్రవరి 9వ తేదీని పలు డెవలప్మెంట్ యాక్టివిటీస్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నట్టు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. దాదాపు రూ.233 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో మున్సిపల్ హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ పంచాయతీ రాజ్ ఆర్ఆర్బి ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 9న పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారైందని పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
మంత్రులు సబితారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా రానున్నట్టు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అవుటర్ లోపల గ్రామాలకు తాగునీటి, పైపులైన్లు, ట్యాంకు నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశాలు విరివిగా నిర్వహించి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.