Friday, December 13, 2024

TG | ఏజెన్సీలో చ‌లి పులి.. వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు

  • ఉమ్మ‌డి ఆదిలాబాద్‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌
  • దట్టంగా కమ్మేసిన పొగమంచు
  • బేలలో ఎనిమిది డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త
  • 24 మండ‌ల్లాల్లో సింగిల్ డిజిట్ న‌మోదు

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : ఒక వైపు పులి.. మ‌రో వైపు చ‌లి.. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ‌లాడుతున్నారు. అల్పపీడన ద్రోణి తీరం దాటడంతో రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి.

నిన్న, మొన్న‌టి వ‌ర‌కు పెద్ద‌పులుల సంచారం ప‌ల్లె సామాన్య జ‌నానికి కంటి మీద కునుకు లేకుండా చేయ‌గా, రెండు రోజులుగా ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కు జ‌న‌జీవ‌నం స్తంభించిపోతోంది. ఉద‌యం రాత్రి వేళ‌ల్లో 6 నుంచి 9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదవుతుండ‌గా, మ‌రో వారం రోజుల్లో ఐదు నుంచి మూడు డిగ్రీల‌కు ప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

దట్టంగా కమ్మేసే పొగ మంచు, అతి శీతల పవనాల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు వాతావార‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

- Advertisement -

24 మండ‌ల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్ర‌త‌లు…

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 24 మండ‌లాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత న‌మోదైంది. కొమురం భీం జిల్లా సిర్పూర్‌టీలో 8.3 డిగ్రీలు, భీంపూర్ అర్లిటిలో 8 డిగ్రీలు, మావల, జైనథ్, ఆదిలాబాద్ రూరల్, గుడిహత్నూర్, బజార్హత్నూర్, బేల, బోథ్ మండలాల్లో 8 నుండి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిర్మల్ జిల్లా పెంబి మండలంలో 8.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా తపాలాపూర్ లో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మెదక్ జిల్లా శివంపేటలో గురువారం అత్యల్పంగా 9.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా నల్లపల్లిలో 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత న‌మోదైంది.

ఏజెన్సీలో మంచు దుప్పటి…

ఎముకలు కొరికే చలికి తోడు ఏజెన్సీలో దట్టమైన మంచు కురుస్తోంది. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దట్టమైన మంచు వాతావరణంలో ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాలు క‌నిపించ‌డం లేదు. ద‌ట్ట‌మైన‌ మంచు వ‌ల్ల ఉట్నూర్, నార్నూర్, తిర్యాని, కెరమెరి, ఆసిఫాబాద్, జై నూర్ మండలాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి.

వృద్ధులు పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలంటేనే గజగజలాడిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలులు వీస్తాయని, చలి తీవ్రత మ‌రింత పెరుగుతుంద‌ని, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి.

పిల్ల‌లు.. వృద్ధుల ప‌ట్ల జాగ్ర‌త్త‌

శీతలగాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. పిల్ల‌లు, వృద్ధుల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల తీవ్ర‌త పెరిగింది. కొద్ది రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.

వారం రోజులపాటు వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ప‌ది గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటున్నందున పాఠశాల ప్రారంభ‌ సమయం మరింత పెంచాలని విద్యార్థుల‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఏజెన్సీలో ర‌గ్గులు పంపిణీ

ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ వాసుల‌కు ఎస్పీ గౌస్ అలం ర‌గ్గులు పంపిణీ చేశారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా నార్మూర్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజ‌నుల‌కు ఆయ‌న ర‌గ్గులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మారుమూల గిరిజ‌నులు చ‌లి ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement