(ఆంధ్రప్రభ ప్రతినిధి హనుమకొండ ) : పని పాట లేని ప్రతిపక్షాలు అక్కడక్కడా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సదుపాయాలు కల్పిస్తున్నామని, అయితే నూటికి ఒక్కరికి మిస్ అయితే దానిని రాద్ధాంతం చేస్తున్నారని, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తూన్నాయని ఆరోపించారు. శనివారం వరంగల్ నగరంలో రూ.50లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాపాలన ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గం 3500 చొప్పున ఇళ్ళు మంజూరు చేశామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలులోకి తెచ్చామన్నారు. కొన్నిచోట్ల లబ్దిదారులు తమ ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోకపోవడం వల్ల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ అందడం లేదన్నారు. అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు ఆదేశించారు…
సమాజం మేలుకోరేవారే బ్రాహ్మణులు..
బ్రాహ్మణులు సమాజం మేలుకోరుకునేవారేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సమాజహితం కోరుకునే బ్రాహ్మణులు పేదరికంతో అలమటిస్తున్నారన్నారు పరకాల ఎమ్మెల్యే రేవూరి. ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక కమీషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే లు నాయిని.రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్యశారద, కమిషనర్ తానాజీ, తదితరులు పాల్గొన్నారు.