హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారాస ఆపరేషన్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులతో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలపై నజర్ నడుస్తోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి హస్తంలోని కీలక నేత గులాబీ పార్టీలో చేరిక దాదాపు ఖరారు అయ్యింది. ఈ నెల 17న చేరాలని మొదట నిర్ణయించినా తర్వాత ఒక్క రోజు ముందుకు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 18న హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆ మరుసటి రోజే 19న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ నేత కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత గొడవలు, పార్టీలో తనకు తగ్గిన ప్రాధాన్యతపై ఎప్పటికప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతోనే అధికార పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు అనుచరులతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీలకు అతీతంగా సొంత క్యాడర్ ఉన్న ఆ నేత చేరితే హస్తం ఓట్లు గులాబీకి మళ్లే అవకాశాలున్నట్లుగా భారాస భావిస్తోంది. ప్రజల లీడర్‌గా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే రాకను పార్టీలోని నేతలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు గులాబీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గులాబీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మరికొంత మంది నేతలు సైతం కారు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే సైతం పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నా.. చేరిక ఖరారు మాత్రం కాలేదు. అధిష్టానం ఆ నేత చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. హస్తంలోని పీపుల్ లీడర్ వస్తున్నందుకే అక్కడ పార్టీ బాధ్యతలను ఎవరికి కట్టబెట్టలేదని గులాబీ నేతలు వెల్లడిస్తున్నారు. పార్టీ తరపున ప్రచారం సైతం పెద్దగా అక్కడ జరగడం లేదని తెలుస్తోంది.