Tuesday, November 26, 2024

Operation Akarsh – ట‌చ్ లో 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు … బాంబు పేల్చిన‌ బండి సంజ‌య్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ”బీజేపీ కార్పోరేటర్లు మాతో టచ్‌లో ఉన్నారని సీఎం కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీ రామారావు చెబు తున్నారు. కాని ఆయనకు తెలియదేమో 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా రాజ కీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే బీజేపీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. ధరణి మంచి పోర్టల్‌ అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ధరణి పోర్ట ల్‌తో లాభపడింది కేవలం సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రమేనని, ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ధరణిని తీసుకువచ్చారని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ బాధి తులంతా ఏకంగా బహిరంగసభ నిర్వహించవచ్చునని సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్‌కు గుర్తు చేశారు.

మరో ఐదు నెలలు ప్రజలు ఓపికపడితే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ప్రక టించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ కార్యాల యాన్ని బుధవారం బండి సంజయ్‌ ప్రారంభించారు. అనంతరం మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో బండి సంజ య్‌ మాట్లాడుతూ…. కాంగ్రెస్‌ పార్టీ జాకీపెట్టి లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. అసలు తెలంగాణలో ఆ పార్టీ ఎక్కడుంది..? అని ప్రశ్నిం చారు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పో యిం దన్నారు. డిపాజిట్లు కరువైన పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్న్యాయం ఎలా అవుతుంది..? అని ప్రశ్నించారు. ఢిల్లిdలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించేందుకు పనిచేశాయని, ఈ పరిణామం చూసి ఎవరు బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నేతలంతా పోస్టు పెయిడ్‌ నాయకులేనని, గెలవకపోయినా బీఆర్‌ ఎస్‌లోకి వెళ్లే నేతలంతా ప్రి పెయిడ్‌ నేతలని, అలాంటి కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేసే పార్టీ బీజేపేనని స్పష్టం చేశారు. బరాబర్‌ హిందూత్వం గురించి మాట్లాడుతానని తేల్చి చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లేలా చేసిన ఘనత బీజేపీ దేనన్నారు. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రాని 30చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు పంచుతున్నాడని ఆరోపించారు.

కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేద న్నారు. సీఎం కేసీఆర్‌ పేద, సామాన్య ప్రజలకు చేసిందేమిటీ..? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జగద్గిరిగుట్టలో ఆర్టీసీ డిపో, ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేస్తామనని హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌ మినీ ఇండియా అని, ఒక్క వ్యక్తికైనా ఇక్కడ న్యాయం జరిగిందా..? అని అడిగారు. ఇలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తుంటే దారిమళ్లించేందు కు బీజేపీ కార్పోరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని కేటీఆర్‌ అం టున్నారని దుయ్యబట్టారు.

కమిషన్లు దోచుకునేందుకు నిమ్స్‌లో శిలాఫలకం…
నిమ్స్‌లో 2వేల పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం శిలాఫలకాన్ని కేసీఆర్‌ వేశారని, అయితే కేసీఆర్‌ వేసిన శిలాఫలకాలతో ఏకంగా ఉస్మానియా ఆస్పత్రినే కట్టొచ్చని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్‌ దొబ్బేందుకే శంకుస్థాపనలు చేస్తు న్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఒక్కో తలపై రూ.1.2లక్షల అప్పుల భారం మోపిం దన్నారు. అగ్రకుల పేదల రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

- Advertisement -

కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వమే…
మరోసారి కేంద్రంలో ఏర్పడేది మోడీ ప్రభుత్వమేనని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచి డ బుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే రూ.5 లక్షల కోట్ల అప్పు తీరుతుందన్నారు. ఉద్యో గులకు 1వ తారీకునే జీతాలు వస్తాయని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మరోమారు సీఎం కేసీఆర్‌కు పొరఎ ాటున అవకాశమిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పులు చేస్తాడని, ఒక్కో వ్యక్తిపై రూ.2.4లక్షల కోట్ల అప్పు భారం మోపుతారని ప్రజ లను హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ నిధులు సక్రమంగా చెల్లిస్తా మన్నారు. ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్‌ సర్కారును మరో ఐదు నెలల్లో ఇంటికి సాగనంపుతామని, అవినీతిపరులను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల సంగతి చూస్తామన్నారు.

రాజకీయాల నుంచి కేసీఆర్‌ ఇక రిటైర్‌ : తరుణ్‌చుగ్‌
కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ స్పష్టం చేశారు. త్వరలో కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగబోతోందన్నారు. కెెసీఆర్‌ రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యే సమయం ఆసన్న మైందని స్పష్టం చేశారు.

అవి కమిషన్‌ ప్రభుత్వాలు: ఎంపీ లక్ష్మణ్‌
రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ 85శాతం కమిషన్‌ ప్రభుత్వమని, ప్రతి స్కీం వెనక స్కాం చేస్తుందన్నారు. దళితులను దగా చేస్తున్న సర్కారు బీఆర్‌ఎస్‌దని, అది 30శాతం కమిషన్‌ ప్రభుత్వమన్నారు. జీరో పర్సంట్‌ కమిషన్‌ ప్రభుత్వం నరేంద్రమోడీదన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నిరుపేదల ఖాతా ల్లో నగదు జమ చేస్తోన్న ప్రభుత్వం మోడీదన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. ఈ సభలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎన్వీఎస్‌ ప్రభాకర్‌, మల్లారెడ్డి, బొమ్మ జయశ్రీ, హరీష్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement