ఉమ్మడి కరీంనగర్, (ప్రభన్యూస్ బ్యూరో): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీ-ఆర్‌ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసిఫ్‌నగర్‌కు చెందిన పలువురు బీజేపీ నుంచి టీ-ఆర్‌ఎస్‌లోకి మంత్రి సమక్షంలో చేరారు. మంత్రి గంగుల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలని ఆనాడు ఏ ప్రభుత్వం ఆలోచించలేదని, గ్రామాలు ఆర్థికంగా ఎదగాలని టీ-ఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. మండువేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాక ముందు కరీంనగర్‌లో తాగు, సాగునీటికి అరిగోసలు పడేవాళ్లమని గుర్తు చేశారు. కరెంట్ కావాలని ఆనాడు తానే స్వయంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తే కేసులు నమోదు చేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
త్వరలోనే గ్రామ గ్రామాన తిరుగుతూ.. అందరికి వద్దకు వస్తానని మంత్రి పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ధనికుల కోసమే ధనికుల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. అన్ని ప్రైవేట్‌పరం చేసి అంబానీ, అదానీలకు ఇస్తున్నారని.. భవిష్యత్‌లో అంబాని ఎక్స్‌ప్రెస్, అదాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంటాయని విమర్శించారు. దేశంలో ఎవరి మతం వారిదని, ఎవరి విశ్వాసం వారిదని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులకు వినోద్‌కుమార్ సవాల్ విసిరారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్దమేనానని సవాల్ విసిరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..