Monday, November 25, 2024

ఆన్‌లైన్‌ మోసం, డబ్బు కోల్పోయిన బాధితుడు.. పోలీసుల చొరవతో కొంత నగదు అప్పగింత

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌కు స్పందించి డబ్బులు కోల్పోయిన బాధితుడికి పోలీసులు చొరవ తీసుకొని కొంత నగదును తిరిగి ఇప్పించిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి బాధితుడికి బ్యాంకు ఫ్రీజ్‌ చేసిన రూ. 16,482లను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన బంక భూమయ్యకు మార్చి 25న 9831770892 నంబరు నుంచి అపరిచి వ్యక్తి కాల్‌ చేసి మినిస్ట్రీ ఆఫ్‌ కంజ్యూమర్స్‌ అఫైర్స్‌గా పరిచయం చెసుకున్నాడన్నారు.

ఎస్‌బీఐ కస్టర్‌ సర్వీస్‌ పాయింట్‌గా నమ్మించడంతో భూమయ్య డిజిటల్‌ ఇండియా కార్పోరేషన్‌ బ్యాంకు ఖాతాకు తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ. 10వేలు ఒకసారి, మరోసారి రూ. 9100, రూ. 10వేల చొప్పున మొత్తం రూ. 29,100 నగదు బదిలీ చేశాడన్నారు. మరింత నగదు పంపించాలని కోరగా అనుమానంతో ఆరా తీయడంతో మోసపోయినట్లు గ్రహించాడన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో ఎన్‌సీఆర్‌ పోర్టల్‌లో మోసానికి సంబంధించి బ్యాంకు వారి ద్వారా రూ.16,482 ఫ్రీజ్‌ చేయించి, కోర్టు ద్వారా నెల రోజుల్లోపు అట్టి నగదు అందించినట్లు ఏసీపీ వివరించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్‌కు స్పందించి మోసపోవద్దని ఏసీపీ ప్రజలకు సూచించారు. మీడియా సమావేశంలో సీఐ ప్రదీప్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement