హైదరాబాద్, ఆంధ్రప్రభ: రైల్వే స్టేషన్లను స్థానిక ఉత్పత్తులను విక్రయించేందుకు, ప్రోత్సహించే కేంద్రాలుగా రూపొందించాలనే లక్ష్యంతో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ వినూత్న కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆరు ప్రధాన స్టేషన్లలో ప్రారంభించారు. తిరుపతి స్టేషన్‌లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టుకు వచ్చిన అద్భుత స్పందనకు ఉత్సాహం పొంది ఇప్పుడు సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్‌లలో మొదటిసారి ప్రారంభించారు. తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కావడంతో దీన్ని 30 రోజులపాటు అంటే ఏప్రిల్ 9 నుంచి మే 7 వరకు ఐదు నూతన స్టేషన్లలో అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతిలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం ఇప్పుడు మరో 30 రోజులకు పొడిగించబడింది. అక్కడ వచ్చిన భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో జోన్‌లోని ప్రధాన స్టేషన్లలో 15 రోజులుగా రెండు విడతలుగా విభజించి మరో 30 రోజులు నిర్వహించి ప్రతి విడతలో ఎక్కువ సంఖ్యలో కళాకారులకు అవకాశాలు ఇచ్చి వారి ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రోత్సహించాలని నిర్ణయించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేలా రైల్వే స్టేషన్‌ను ఒక విక్రయ కేంద్రంగా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్తకళాకారులకు, కుమ్మరులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులు జీవనోపాధి, సంక్షేమాన్ని మెరుగుపర్చి స్థానిక పరిశ్రమలను బలోపేతం చేకూర్చాలనే ప్రధాన లక్ష్యంతో 2022-23 కేంద్ర బడ్జెట్‌లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ విధానాన్ని ప్రకటించారు. తదనుగుణంగా ద.మ.రైలోని ఆరు డివిజన్ల పరిధిలో ఒక ప్రధాన స్టేషన్ గుర్తించి ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.