హైదరాబాద్, ఆంధ్రప్రభ: డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో లక్ష వరకు సీట్లను ఫ్రీజ్ (హోల్డ్) చేశారు. దీంతో మొత్తం సీట్లల్లో లక్ష సీట్లకు కోతపడింది. కాలేజీల్లో 15 అడ్మిషన్ల లోపు ఉండే కోర్సులు, సెక్షన్లు బ్లాక్ చేశారు. అయితే వచ్చే ఏడాదిలో మాత్రం హోల్డ్‌లో పెట్టిన ఈ లక్ష సీట్లను కోర్సులు కన్వర్షన్ చేసుకుని నడిపించుకునేందుకు కాలేజీ యాజమాన్యాలకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. దాదాపు 900 కాలేజీలపై దీనిప్రభావం పడనుంది. రాష్ట్రంలో దాదాపు వెయ్యికి పైగా కాలేజీలు ఉంటే అందులో 978 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. ఇంఉలో మొత్తంగా 4.60 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిపిన మూడు విడతల్లో నిండిన సీట్లు కేవలం 1.53 లక్షలే. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ఇంకా నడుస్తోంది.
ఏటా డిగ్రీలో 2.50 లక్షల లోపు సీట్లే నిండుతున్న పరిస్థితి ఉంది. మిగిలిన 2.10 లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కొన్ని కోర్సుల్లో చేరడంలేదు. కొన్ని కాలేజీల్లో ఇన్‌టేక్ కంటే ఎక్కువ మంది చేరుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాందో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. దాంతో విద్యార్థులు చేరని కోర్సులను, సెక్షన్లను రద్దు చేసిటన్లు ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు.
కొద్దిగా పెరిగే ఛాన్స్…
సెప్టెంబర్ 16న మూడో విడత సీట్లను కేటాయించారు. అయినా ఇంకా 3 లక్షల వరకు సీట్లు మిగలడంతో స్పెషల్ ఫేజ్‌ను నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 9న స్పెషల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. అయినా గానీ భారీ స్థాయిలో సీట్లు నిండే పరిస్థితి లేదు. అలాగే ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఇంకా పూర్తికాలేదు. ఎంసెట్‌లో సీటు రాని విద్యార్థులు డిగ్రీ వైపు చూస్తారు. దీంతో మరో 70 వేల డిగ్రీ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా చూసుకున్నాగానీ 2.20 లక్షల కంటే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చేరాలంటే కొత్త కోర్సులు రావాల్సి ఉంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే కోర్సులను తీసుకురావలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.