హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఆయా నెలల్లో నీటి మట్టం నిర్వహణ (రూల్ కర్వ్) ను ఏ సమాచారం, ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయిస్తున్నారో చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ కోరింది. ఈ విషయమై కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ ప్రత్యేకంగా శనివారం లేఖ రాశారు. సెప్టెంబరు 2 న రిజర్వాయర్ కమిటీ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఎంసీ) సమావేశంలో రూల్ కర్వ్ ముసాయిదాపై చర్చించాల్సి ఉన్నందున ప్రాతిపదిక సమాచారాన్ని అందించాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల రూల్ కర్వ్ ప్రాతిపదిక సమాచారాన్ని ఇవ్వాలని ఇప్పటికే పలు మార్లు కోరినా స్పందించడం లేదని లేఖలో బోర్డుపై ఈఎన్‌సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే నెల 30న జరిగిన రెండో ఆర్‌ఎంసీ సమావేశం సారాంశంలో… రూల్ కర్వ్ ను
కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ -1 , చెన్నై నగరానికి తాగునీటిని అందించే అంతరాష్ట్ర నదీ జలాల ఒప్పందం ఆధారంగా రూల్ కర్వ్ ను నిర్ణ యించాలని నిబంధనలు చెబుతున్నట్లుగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో గత 37 ఏళ్ల నీటి లభ్యత (1984-2021) ఆధారంగా, రిజర్వాయర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్(ఎఫ్‌ఆర్‌ఎల్) 885 అడుగులు, ఎండీడీఎల్ 854 అడుగులను రూల్ కర్వ్ నిర్ణయించే ముందు పరిగణనలోనికి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ లేఖ అందినతర్వాతనైనా రూల్ కర్వ్ నిర్ణయాక అంశాలు, పరిగణనలోనికి తీసుకుంటున్న సమాచారాన్ని అందించాలని కేఆర్‌ఎంబీని ఈఎన్‌సీ కోరారు.