సూర్యాపేట,( ప్రభన్యూస్ ): సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన యాత్ర మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం సూర్యాపేట నుంచి చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), మద్దిరాల, ఫణిగిరి, తిరుమలగిరి వరకు సాగింది. చివ్వెంలలో పర్యటిస్తున్న సందర్భంలో బండి పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య దాడులు, ప్రతి దాడులు జరగడంతో పర్యటన ప్రాంతం రణరంగంగా మారింది.
టీఆర్ఎస్, బీ జేపీ కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ ప్రతి దాడులను నివారించేందుకు పోలీసులు ఆందోళన కారులపై లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బండి సంజయ్ పర్యటనలో రెండవ రోజు జరిగిన యాత్ర సందర్భంగా బీజేపీ తెరాస కార్యకర్తల దాడులు ప్రతి దాడులతో రాళ్ల వర్షానికి ఇరు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అర్వపల్లిలో బీజేపీ నాయకుల వాహనాలపై తెరాస కార్యకర్తలు రాళ్లు విసరడంతో ధ్వంసమయ్యాయి. అర్వపల్లిలో బీజేపీ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల దాడులను నియంత్రించే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆత్మకూర్(ఎస్) మండలంలో సైతం ఇద్దరు పోలీసులకు, ఐదుగురు నాయకులకు గాయాలయ్యాయి..
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily