Friday, November 22, 2024

TS: పెట్టుబడిదారుల వైపా.. పేద బిడ్డ వైపా.. బాల్క సుమన్

చెన్నూరు (ప్రభ న్యూస్): రాజకీయాలను కలుషితం చేస్తున్న పెట్టుబడిదారుల వైపు ఉంటారా.. పేద బిడ్డ సుమన్ వైపు ఉంటారా చెన్నూరు ప్రజలు తేల్చుకోవాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పేర్కొన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… మూడు దశాబ్దాల పాటు కుటుంబ పరిపాలన కొనసాగించి దేశవ్యాప్తంగా కంపెనీలు పెట్టిన వివేక్ చెన్నూరులో ఒక పరిశ్రమ కూడా ఎందుకు స్థాపించలేదన్నారు. పక్కనే గోదావరి పారుతున్న చెన్నూరుకు చుక్క నీరు కూడా ఎందుకు తెలియలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నారని గత నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు కనిపించని నాయకులు ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయనగా సూటు బూటు వేసుకొని కోట్ల రూపాయలు సూటు కేసుల్లో వేసుకొని అడ్డగోలుగా లీడర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చెన్నూరు ప్రజలు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వారి వైపు ఉంటారా నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన సుమన్ వైపు ఉంటారా అని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని పొరపాటున చేయి గుర్తుకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడన్నారు.

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు అందిస్తామని, తెల్లరేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛన్లను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించడంతోపాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కూడా జనార్ధన్ రాజా రమేష్ భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement