Tuesday, November 26, 2024

ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో పాత ఫీజులే! టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ 2022-23 విద్యాసంవత్సరంలోనూ ఇంజనీరింగ్‌, వృత్తివిద్యా కోర్సుల్లో పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేరటీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించినట్లు తెలిసింది. గత బ్లాక్‌ పిరియడ్‌ 2019-22లో అమలు చేసిన ఫీజులనే ఈ విద్యా సంవత్సరంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23, 2023-24, 2024-25 బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించి ఈ మూడు విద్యా సంవత్సరాల ఫీజుల ఖరారుపై టీఏఎఫ్‌ఆర్‌సీ గత కొంతకాలంగా కసరత్తులు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఇటీవల ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపుపై ఇంజనీరింగ్‌ కాలేజీలతో సంప్రదింపులను టీఏఎఫ్‌ఆర్‌సీ పూర్తి చెసి కొత్త ఫీజులను ఖరారు చేసింది. అయితే సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో కళాశాలలతో భేటీ అయిన కమిటీ కరోనా, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వరకు పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులను విద్యా సంవత్సరం ప్రారంభం ముందు సమీక్షిస్తారు. ఈక్రమంలోనే 2022-25 బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించిన ఫీజులను కమిటీ ఖరారు చేసి జూలై 26న జరిగిన సమావేశంలో కొత్త ఫీజులకు ఆమోద ముద్ర వేసిన కమిటీ ఆ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి పంపించింది కూడా.

కళాశాల ఆదాయ, వ్యయాలు, మౌలిక వసతులు, ఫ్యాకల్టి ఇతర వాటికి అయ్యే ఖర్చును బట్టి ఫీజులను నిర్ణయిస్తారు. 2019లో నిర్ణయించిన ఫీజు గడువ ఈ ఏడాదితో ముగియడంతో వచ్చే 2022-25 మూడేళ్లకు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్‌ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ ఈనెల 20 వరకు భేటీ అయి వారి అభిప్రాయాలను విని ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేసింది. ఈక్రమంలోనే కనీస ఫీజును రూ.45 వేలుగా, గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. ప్రస్తుతం రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును ఈ విద్యాసంవత్సరం నుంచి రూ.45వేలుగా, ప్రస్తుతం రూ.1.34లక్షలుగా ఉన్న గరిష్ట ఫీజును 2022 నుంచి 1.73 లక్షలుగా ఇటీవల ఖరారు చేసింది. అయితే ఈ ఫీజులను కాలేజీల వారీగా ఖరారు చేశారు. తాజాగా కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఫీజులు ఈ ఏడాదిలో అమల్లోకి రావు. గత బ్లాక్‌పిరియడ్‌లో ఉన్న కనిష్ట ఫీజు రూ.35వేలు, రూ.1.34లక్షలు గరిష్ట ఫీజును మాత్రమే ఈ ఏడాదికి వసూలు చేయాల్సి ఉంటుంది. కరోనా, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కమిటీ తీసుకున్న ఈ నిర్ణయిం విద్యార్థులకు ఊరట కలిగించనుంది. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, అర్కిటెక్చర్‌ కోర్సు ఫీజుల ఖరారుపై ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ఫీజుల పెంపు అంశంపై టీఏఎఫ్‌ఆర్‌సీ కాలేజీలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement