యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ అంశంపై రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు వారికి భరోసా కల్పించే విధంగా మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇంతకాలం వరి పండించిన పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సిద్దమవుతున్నారు. ఆయిల్ ఫామ్ సాగు పనులకు మంత్రి గంగుల స్వయంగా శనివారం శ్రీకారం చుట్టారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా భూమిని సేద్యం చేసారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువైనవని నిర్దారణ అయిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంచేందుకు లోహియా కంపెనీని ప్రభుత్వం నియమించిందని, రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడం మొదలు కోత అనంతరం గెలలు తీసుకునే వరకూ ఆ కంపెనీ అండగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కోతుల బెడద లేకుండా, చీడపీడల బెడద తక్కువతో సాగయ్యే ఆయిల్ ఫామ్ చెట్లను తొమ్మిది మీటర్లకు ఒక మొక్క చొప్పున ఎకరాకు దాదాపు 57 మొక్కలను నాటొచ్చని పేర్కొన్నారు. దీంతో 10టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు 10వేల ధర వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు రూ.70 నుండి రూ. 80వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..