Monday, September 16, 2024

TG: ముందస్తు చర్యల్లో ‘అధికారుల సేవలు భేష్’

మోరంచ ఉదృతిని అర్థరాత్రి పరిశీలించిన ఆర్డీవో మంగిలాల్
వాగు వద్ద ప్రత్యేక మానిటరింగ్ టీమ్ ఏర్పాటు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి విపత్తు జరగకుండా జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముందస్తు చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదివారం ఎడతెరిపిలేకుండా కురిసిన మోస్తరు వర్షంతో మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చింది. గత సంవత్సరం జరిగిన విపత్తు అనుభవాలను దృష్టిలో వుంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం నుండి గంట గంటకు మోరంచ వాగు వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, మొరంచపల్లిలోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు మోరంచ బ్రిడ్జి వద్ద ప్రత్యేక మానిటరింగ్ టీమ్ ను ఏర్పాటు చేశారు.

ఆ సిబ్బంది వర్షంలో సైతం తెల్లవారుజాము వరకు బ్రిడ్జి వద్దే అంకిత భావంతో విధులు నిర్వర్తించారు. కాగా భూపాలపల్లి ఆర్డీవో మంగిలాల్ అర్ద్రరాత్రి (12 గంటలు) తర్వాత సైతం మోరంచ వాగు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహ ఉధృతిని స్వయంగా పరిశీలించి విధుల్లో వున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో ఎప్పటికప్పుడు సిబ్బందిని అలెర్ట్ చేస్తూ విధుల పట్ల తన మార్కును చాటుకున్నారు. అంతే కాకుండా పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి పరకాల శివారు చలివాగు బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురికావడంతో బ్రిడ్జి బలహీనపడే అవకాశం ఉన్నందున అటువైపు భారీ వాహనాలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాత్రి భూపాలపల్లి వైపు నుండి పరకాల వైపు వెళ్లే భారీ వాహనాలను గాంధీనగర్ క్రాస్ నుండి ములుగు మీదుగా దారిమళ్లించారు. అర్ధరాత్రి కూడా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement