Tuesday, September 17, 2024

TG: అధికారులు సమన్వయంతో పని చేయాలి… మంత్రి సీతక్క‌

సామరస్య పూర్వక వాతావరణాన్ని కొనసాగించే చర్యలు చేపట్టండి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
అసాంఘీక శక్తులకు మంత్రి సీతక్క వార్నింగ్
వినాయక చవితి ఏర్పాట్లపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క టెలి కాన్ఫరెన్స్


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో, అప్రమత్తంగా వ్యవహరించి శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతమ‌య్యేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, డీపీఓలు, మున్సిపల్ కమిషన‌ర్లతో శుక్రవారం సచివాలయంలో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వినాయక చవితి ఏర్పాట్లను సమీక్షించారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

జిల్లాలో శాంతికి విఘాతం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం సహించదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు. శాంతి భద్రతల‌ విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేశారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తమన్న మంత్రి, అందరి హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణం లేకపోతే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడ ఏదైనా సమస్యలు తలెత్తితే దాని మూలాల్లోకి వెళ్లి తుంచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లకు వంద శాతం జీతాలను తమ ప్రభుత్వం పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. ఇంకా జిల్లా అభివృద్ధి కోసం మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

వినాయక చవితి నేపథ్యంలో జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు పలు కీలక సూచనలు చేశారు మంత్రి సీతక్క. విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డయల్‌ 100కి వచ్చే కాల్స్‌పై తక్షణమే స్పందించాలనీ.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా మీద నిఘా పెంచాలని చెప్పారు. జైనూరు తరహాలోనే జిల్లా వ్యాప్తంగా అన్నివర్గాల మత పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి పరస్పరం విశ్వాసం నెల కొల్పేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీత‌క్క‌ ఆదేశాలు జారీ చేశారు.

టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా తమ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను, నెలకొని వున్న శాంతిభద్రతల పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మంత్రికి వివరించారు. మంత్రి సూచనలకు అనుగుణంగా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేసి వినాయక చవితి వేడుకలను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement