Friday, September 20, 2024

Odisha – నైనీ బ్లాకులో చెట్ల గణనకు ముహూర్తం ఫిక్స్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇటీవ‌లి ఒడిశా ప‌ర్యటన త‌ర్వాత నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి మిగిలిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి కే 643 హెక్టార్ల రిజ‌ర్వు అట‌వీ భూమిని సింగ‌రేణికి బ‌ద‌లాయిస్తూ ఒడిశా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.. తాజాగా 140 హెక్టార్ల గ్రామ అట‌వీ భూమిని కూడా అప్ప‌గించడంపై సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి వీలుగా చెట్ల గణన, తొలగింపు ప్రక్రియకు కూడా పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజా ను ఆయన కోరారు. దీనిపై అహూజా సానుకూలంగా స్పందించారు. తన విజ్ఞప్తి మేరకు 10 రోజుల్లో చెట్ల గణన ప్రక్రియ చేపట్టే విషయంపై ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్త బ్లాక్ ల స్థితిగతులపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎండీ మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా, ఒడిశా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మనోజ్ అహుజా, ఒడిశా రాష్ట్ర బొగ్గు, స్టీల్ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ కార్యదర్శులు, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(నోడల్, వన్యప్రాణి సంరక్షణ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

కోల్ ఇండియా ఛైర్మన్ తో పాటు సింగరేణి, మహానది కోల్డ్ ఫీల్డ్స్, ఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ సంస్థల సీఎండీలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో అందరూ సీఎండీలు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని కలిసి సమావేశ వివరాలను వెల్లడించారు. ఒడిశాలో సింగరేణి సహా ఇతర మైనింగ్ కంపెనీల ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం నైనీ బొగ్గు బ్లాక్ విస్తరించి ఉన్న చండీపడా నియోజకవర్గ ఎమ్మెల్యే అగస్తి బెహరా ను కూడా సంస్థ సీఎండీ కలిసి సహకారం కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement