కర్మన్ ఘాట్, (ప్రభ న్యూస్): రోడ్డును ఆక్రమించుకుని ప్రహరీగోడ నిర్మించారని, ఆ గోడ తొలగించాలని హైదరాబాద్‌లోని ఓ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. హస్తినాపూర్ డివిజన్ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ మధ్యలో అపార్ట్‌మెంట్ కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. దీని వల్ల రహదారికి ఇబ్బందిగా మారిందని, గతంలో అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అందుకే ఆందోళన చేయాల్సి వస్తోందని విశ్వేశ్వరయ్య కాలనీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, టీచర్స్ కాలనీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి తెలిపారు.
నిర్మాణం చేపడుతున్న బిల్డర్ వెంటనే ప్రహరీ గోడను తొలగించి, రెండు కాలనీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఒక అడుగు ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మించుకున్నారని, ఈ విషయంపై మూడు రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఆందోళనలో కాలనీ ప్రధాన కార్యదర్శి ఐలేష్, విజయ భాస్కర్ రెడ్డి , ప్రకాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి , రమేష్, నర్సిరెడ్డి ,యాదయ్య, యాదగిరి పాల్గొన్నారు.