ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్: ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు మొదలైంది. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 9 నుండి మొదలయ్యే కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమై పాదరక్షలు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి బయలుదేరారు.
సుమారు 250 మంది ఆదివాసి మెస్రం వంశస్థులు 125 కిలోమీటర్ల వరకు వివిధ గ్రామాలకు ఉన్న పాదయాత్ర నిర్వహించి గోదావరి నది నుండి గంగా జలాలను సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్ర గంగా జలాలను కళాశాల ద్వారా తీసుకువచ్చి తమ ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ లోని నాగోబాకు అభిషేకించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు కాలినడక ద్వారా గంగా జలాలను తీసుకువచ్చి కిస్లాపూర్ లోని సాంప్రదాయ మర్రిచెట్టుకు కలశాలు కట్టి ఆలయ పూజారి సూచన మేరకు నాగోబాకు అభిషేకించన్నారు. ఆదివారం నాడు మెస్రం వంశస్తులంతా హాజరై మహా పాదయాత్రకు వెళ్లే మార్గం గురించి, ఎక్కడెక్కడ బస చేయాలి అన్న అంశాలపై రూట్ మ్యాప్ రూపొందించుకున్నారు. ఆదివారం రాత్రి ఆచారం ప్రకారం మెస్రం వంశస్తులంతా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బస చేసి మరుసటి రోజు నుండి పాదయాత్ర హస్తినమడుగు వరకు కొనసాగనుంది. ఆదివాసుల పూజారి ప్రధాన్, నాగోబా ఆలయ నిర్వాహకులు హనుమంతరావు తో పాటు మత పెద్దలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9 నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో మహా జాతర ప్రారంభం కానుంది. చత్తీస్గడ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా ఆదివాసులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.