Friday, November 22, 2024

నర్సులే డాక్టర్లు… రోగుల అవస్థలు

వాజేడు, మే 1 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు ఒకరు లీవ్ లో ఉండగా.. మరొకరు విధులకు గైర్హాజరయ్యారు. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా విధులు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా.. అక్కడి స్టాఫ్ నర్స్ మందులు ఇచ్చి పంపిస్తున్నారు.

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించాల్సిన వైద్యాధికారులు ఏజెన్సీ ప్రాంత రోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులు నిరాశకులోనై వెనుదిరిగి ఇంటికి వెళుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని రోగులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సాధించి ఏజెన్సీ మండలాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement