Tuesday, November 26, 2024

తాటి చెట్లకు నెంబరింగ్‌.. కొత్త పంచాయతీల్లో కల్లు దుకాణాల లైసెన్సులు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్‌ను వేయాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఆయా చెట్లను నరికివేసే వారిపై కనీసం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్లు దుకాణాలను మంజూరీ చేసి టీసీఎస్‌, టీఎఫ్‌టీ లైసెన్సులను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. టీఎఫ్‌టీ లైసెన్సులను మెజారిటీ సభ్యుల అంగీకారంతో టీసీఎస్‌లుగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కల్లు దుకాణాల తరలింపు, రద్దు చేసిన కల్లు దుకాణాల పునరుద్దరణను క్షేత్రస్థాయిలో డీసీ పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. తాటి చెట్లు ఎక్కే అధునాతన సేఫ్టీ యంత్రాలను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

తెలంగాణకు హరిత హారంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత, గిరక తాటి, ఖర్జూర చెట్లను పెంచాలన్నారు. ఆబ్కారీ శాఖపై బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, డైరెక్టర్‌ ఫారూఖీ, అదనపు కమిషనర్‌ అజయ్‌కుమార్‌, జాయింట్‌ కమిషనర్‌లు కెఏబి శాస్త్రి, ఖురేషీ, సురేష్‌రాథోడ్‌, డిప్యుటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, సహాయ కమిషనర్‌లు చంద్రయ్యగౌడ్‌, శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, ఈఎస్‌లు సత్యనారాయణ, అరుణ్‌కుమార్‌, విజయభాస్కర్‌, విజయ్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement