హైదరాబాద్,ఆంధ్రప్రభ: కాళేశ్వరం అనుబంధ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నిర్మాణ వైఫల్యాలు, నిర్వహణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ నిపుణుల బృదం అంచనాకు వచ్చింది. ఈ మేరకు బ్యారేజీల డిజైన్లను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి కొలతలు తీశారు. డిజైన్ల మేరకు నిర్మాణాలు జరగలేదనే సందేహం వ్యక్తం చేసినట్లు పక్కా సమాచారం. అయితే భూసార పరీక్షలు, బ్యారేజీకి వాడిన మెటీరియల్‌ను తాము కోరిన విధంగా పరీక్షలు చేసి నివేదికలు ఇవ్వాలని నిపుణుల బృందం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.
గత రెండు రోజులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ ప్రతినిధి బృందం అనేక సందేహాలు, వైఫల్యాలను గమనించినట్లు తెలుస్తోంది. తొలుత మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన డిజైన్లు పరిశీలించి కొలతలు తీయగా డిజైన్ల మేరకు కొలతలు లేవనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే మహా రాష్ట్ర వైపున్న మేడిగడ్డ 7వ బ్లాక్, తెలంగాణ వైపున్న 1వ బ్లాక్ భూసారాల్లో వ్యత్యాసం, నీటి ప్రవాహ వేగాల్లో వైరుద్యాలు ఉన్నట్లు నిపుణుల బృదం పరిశీలనలో తెలిసింది.
వరదల సమయంలోమిగతా బ్లాక్ ల్లో కంటే 7వ బ్లాక్ నుంచి లోతులో గోదావరి ప్రవహించిందనీ, సెకను వేగం 100లశాతం పెరిగిందని నిపుణులు గమనించినట్లు సమాచారం. ప్రవాహ వేగం, సామర్థ్యానికి మించి నీటి నిల్వ ఉండటం కూడా ఒక కారణంగా భావించినట్లు తెలుస్తోంది. భూసారంలో తేడాలున్నట్లు ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ (ఈ ఆర్ టీ) రిపోర్టు ద్వారా నిపుణుల బృందం గమనించింది. రాఫ్ట్ సీకెంట్ పైల్స్ మధ్య ఇసుక ఏమేరకు ఒత్తిడికి గురయిందనే అంశాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. భూసారాల్లో వ్యత్యాసాలున్నప్పుడు నిర్మాణాల్లోతీసుకోవల్సిన జాగ్రతలు తీసుకోలేదనే అభిప్రాయంలో నిపుణుల బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ జె. చంద్రశేఖర్ సారథ్యంలో ఎన్డీఏ నిపుణుల బృందం సభ్యులు సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యుసీ. విద్యార్తి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్‌ఆర్ పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్, ఎన్డీఎస్‌ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ శాస్త్రవేత్తల బృందం అన్నారం సుందిళ్ల బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలను పరిశీలించింది. అన్నారం సీపేజ్ ఏర్పడిన 10 బ్లాక్‌తో పాటుగా 38,28 పియర్లను పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. బుంగలు ఏర్పడగానే తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకుంది.
పియర్ల దగ్గర గ్రౌంటింగ్ పనులను పరిశీలించింది. ఎల్ అండ్ టీ ప్రతినిధుల నుంచి ఈ బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లను స్వాదీనం చేసుకుని నిర్మాణాల్లో ప్రతి ఇంచును పరిశీలించింది. స్ట్ర క్చరల్ ఇంజనీరింగ్ లో పియర్లకు బలం చేకూర్చే డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. అయితే గత వంద సంవత్సరాలుగా గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహవేగం, ప్రాజెక్టు నిర్మాణాలను అధ్యయనం చేసింది. నిపుణుల బృందం బ్యారేజీలను పరిశీలిస్తున్నప్పుడు రాష్ట్రానికి చెందిన అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులను కూడా దగ్గరకు రానివ్వలేదు. అవసరమైన ఫోటోలను స్వయంగా ప్రతినిధి బృందం సభ్యులు తీసుకున్నారు.
పోలీసుల సహాయంతో లాంగ్ విజువల్స్ ను డ్రోన్ల సహాయంతో తీసుకున్నారు. నిపుణుల బృదం పరిశీలిస్తున్నప్పుడు ఎవరినీ దగ్గరకు రానీయ కుండా సుమారు కిలో మీటరు పరిధిలోనే ఉంచారు. భారీ సాయుధపోలీసు బలగాల పహారాలో నిపుణుల బృందం శుక్రవారం సాయంత్రం 6.30 గంటల వరకు క్షేత్రస్తాయిలోనే ఉంది. పరిశీలన అనంతరం కావల్సిన నివేదికలను అందివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను నిపుణుల బృదం కోరింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ తొలగించి కొత్తది నిర్మించడమా? లేదా బ్యారేజీ మొత్తానికి మరమ్మతులు చేయాల్సి ఉందా అనే అంశానికి ఈ నిపుణుల బృందం సూచనలు చేయనుంది.
పూర్తి స్తాయి నివేదిక నాలుగు నెలల్లో ఇవ్వనున్నట్లు నిపుణుల బృందం ప్రకటించినప్పటికీ అంతకు ముందే మేడిగడ్డ బ్యారేజీ అంశం పై మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. తొలివిడత పరిశీలనను పూర్తి చేసిన నిపుణుల బృందం హైదరాబాద్ కు చేరుకుని ఇక్కడి నుంచి ఢిల్లిd వెళ్లనుంది. పరిశీలన అంశాలను ఎన్డీఏస్ తో సంప్రదించి అవసరమైతే మరోసారి క్షేత్ర పరీక్షకు నిపుణుల బృదం రానుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి డ్యాంసేఫ్టీ అథారిటీ ఈఎన్సీ నాగేందర్ రావు, అధికారి సరళ ఈనిపుణుల బృందంతో ఉన్నారు.