Friday, November 22, 2024

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. ఆ ఆరుగురు ఎవరు?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 17న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉండగా.. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శాసనసభలో బలాల ప్రకారం ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్  కైవసం చేసుకోవడం లాంఛనమే కానుంది.

మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం టీఆర్ఎస్ పార్టీలో భారీ పోటీ నెలకొంది. అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్… అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ 3న ముగిశాయి. ఈ ఆరుగురు తాజా మాజీలు మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరు ముగ్గురికి రెన్యువల్ కావొచ్చునని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరికి ఎమ్మెల్సీలుగా మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ, మాజీ స్పీకర్ మధుసూదనచారి, పాడి కౌశిక్ రెడ్డిల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement