హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేద, సామాన్యులకు మెరుగైన సర్కారీ వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే పీహెచ్‌సీ మొదలు రాష్ట్ర స్థాయి వరకు పెద్ద సంఖ్యలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయో వివరాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ((సీఏఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ క్రమంలోనే 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి తాజాగా నోటీఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఖాళీలు భర్తీ కానున్నాయి. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
డీపీహెచ్‌అండ్ ఎఫ్‌డబ్ల్యూ డీఎంఈ విభాగంలో 431 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టి జోన్-1లో 270, మల్టిజోన్ -2లో 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండగా , మల్టిజోన్-1లో 1, మల్టిజోన్-2లో 3 పోస్టులు ఉన్నాయి.