నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన లహరి హోటల్, కపిల హోటల్‌లకు శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానాతో పాటు నోటీసులు జారీ చేసింది.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పారిశుద్ధ్య వ్యాపార, వాణిజ్య కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను, వినియోగదారు ఛార్జీలకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు.
నిజామాబాద్ కంటేశ్వర్ ఏరియాలోని లహరి హోటల్‌లో కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించి కొలతల్లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు లహరి హోటల్‌కు నోటీసులు ఇచ్చారు. అంతే కాకుండా లహరి హోటల్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచినందుకు డిప్యూటీ కమిషనర్ రూ.5 వేలు జరిమానా విధించారు. హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాల నాణ్యతతో పాటు శుభ్రత కూడా పాటించాలని డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ హెచ్చరించారు.
కపిల హోటల్ కు రూ.15 వేల జరిమానా…
నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని కపిల హోటల్‌లో కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేయగా… నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, చేపలు దొరికాయని హోటల్ నిర్వాహకులపై డిప్యూటీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసన వచ్చే ఆహార పదార్థాలపై, నిల్వ ఉంచిన చేపలపై ఫినాల్ వేయించారు. అంతేకాదు వంట గది పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంతో డిప్యూటీ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిలువ ఉంచిన చేపలు, అపరి శుభ్రమైన వాతావరణంలో కిచెన్ నిర్వహణపై రూ.15 వేలు జరిమానా విధించారు. అనంతరం ఆస్తి పన్నుకు సంబంధించి కొలతల్లో తేడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై కపిల హోటల్ యాజమాన్యానికి కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు లేకపోండంతో ఆ విషయంలోనూ కపిల హోటల్ కు నోటీసులు ఇచ్చారు.
నిబంధనలు పాటించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం..
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యాపార కేంద్రాలు నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, ట్రేడ్ లైసెన్స్, ఆస్తిపన్ను, యూజర్ ఛార్జీలు క్రమం తప్పకుండా చెల్లించాలని సూచించారు. ఇందుకు వ్యాపార సంస్థలు సహకరించాలని అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌వో నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఆర్‌ఐ సునీల్ సతీష్, జవాన్ ప్రసాద్, కుమార్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.